Neethi Padyalu in Telugu

This article  provides Neethi Padyalu in Telugu. we gave “Padyalu” in Telugu language with “Baavam”(Neethi)

మేడి పండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు,
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభి రామ వినురవేమ!

నీతి : మేడి పండు పైకి చక్కగా నిగ‌నిగలాడుతూ కనిపించినప్పటికీ దానిలో పురుగులుండే అవకాశం ఉంది. అలాగే పిరికి వాడు పైకి ధైర్యం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు !
విశ్వదాభి రామ వినురవేమ

నీతి :  ఓ వేమా! శ్రేష్టమైన ఆవు పాలు ఒక్క గరిటెడైనను విలువైనవే .గాడిద పాలు కుండనిండుగా ఉన్ననూ ఉపయోగము ఏమియు లేదుకదా! కావున భక్తి తో పెట్టిన భోజనము పట్టెడైనా తృప్తి నిచ్చును.

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

నీతి :  తనకు ఉన్న కోపమే తనకు హాని చేసే శత్రువు. తనలో ఉన్న శాంతగుణమే తనకు రక్షగా ఉంటుంది. ఇతరుల దుఃఖాన్ని పోగొట్టటానికి తాను చేసే పనే తనకు బంధువు, చుట్టం. తనకు ఉండే సంతృప్తే స్వర్గం అంటే సంతోషాన్ని కలిగించే చోటుతో సమానం. తనకు ఉన్న బాధే దుఃఖాలను, ఇబ్బందులను కలిగించే స్థానమని విజ్ఞులు చెబుతుంటారు.

కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతీ!

నీతి : పద్మాలు నీటిలో పుట్టి నీటిలోనే పెరుగుతాయి. నీరే వాటికి నివాసం. ఒకవేళ ఆ నీటి నుంచి పద్మాలు బయటపడితే పద్మబాంధవుడుగా ప్రసిద్ధికెక్కిన సూర్యుడికాంతి (ఎండ) సోకి వాడిపోతాయి. అలాగే సొంత చోటును విడిచిపెట్టినవారికి స్నేహితులే శత్రువులుగా మారతారు.

Neethi Padyalu Telugu

తల్లి దండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా ?గిట్టవా?
విశ్వదాభి రామ వినురవేమ

నీతి : తల్లిదండ్రులపైన దయతో ఉండాలి. వృద్ధాప్యంలో వారిని దయతో ప్రేమతో ఆదరించాలి. అలా చేయని కొడుకు ఉన్నా లేనట్టే. అలంటి వాడు పుట్టలోనే పుట్టి చచ్చే చెద పురుగులతో సమానం.

చీమలు పెట్టిన పుట్టలు
పాములకిరవైనయట్లు పామరుడు తగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ!

నీతి : చిన్నచిన్న చీమలు నిరంతరం కష్టపడి మట్టితో పుట్టలు నిర్మిస్తాయి. అయితే అందులో పాములు చేరి నివసిస్తాయి. తెలివితక్కువవాడు వివిధరకాలుగా కష్టపడి అత్యాశతో ధనం కూడబెడతాడు. అయితే అది చివరకు భూమీశులయిన రాజుల ఆస్తిలో కలిసిపోతుంది.

ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ, వినుర వేమా

నీతి : ఓ వేమా! ఉప్పు, కర్పూరం చూచుటకు ఒకే మాదిరి కనపడతాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి. చూడటానికి అందరూ మనుషులొక్కమాదిరి గా కనిపించినా, పుణ్య పురుషులు అంటే సత్పురుషులు వేరుగా ఉంటారు. వారిని గుర్తించగలగాలి. అదే విజ్ఞత.

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ!

నీతి : మంచిబుద్ధికలవాడా! ఎవరు ఏమి చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి. అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిశ్చయానికి రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకొని, ఆ చెప్పిన విషయం అసత్యమో, సత్యమో అని ఎవరు తెలుసుకుంటారో వారు నీతి తెలిసినవారు.

Neethi Padyalu in Telugu

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో !
విశ్వదాభి రామ వినుర వేమా!

నీతి : ఓ వేమా! మంచి మనసుతో చేసిన పుణ్యం కొంచెమైనను భగవంతుని దృష్టిలో విశేషమైనది. మర్రి విత్తనము చాలా చిన్నదైనా , అది పెరిగి , మహా వృక్షము కాదా?

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

నీతి : మంచిబుద్ధికలవాడా! శరీర బలం ఉన్నవాని కంటె తెలివితేటలు ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసి దానిమీదకు ఎక్కగలడు. కండలు తిరిగి, శరీరం దృఢంగా ఉండి బలవంతులైనవారు చాలామంది ఉంటారు. అలాగే బాగా చదువుకుని తెలివితేటలు సంపాదించుకున్న నీతిమంతులు కూడా ఉంటారు.

అయితే వీరి శరీరం దృఢంగా ఉండకపోవచ్చు. కాని వారికున్న తెలివితేటలతో దేహబలం ఉన్నవారి కంటె బలవంతులుగా ఉంటారు సంఘంలో. ఏనుగు కొండంత ఉంటుంది. జంతువులన్నిటిలోకీ శరీరబలం ఉన్నది ఏనుగు మాత్రమే. మరే ప్రాణికీ అంత బలం లేదు. మావటివాడు ఏనుగు పరిమాణంలో పదోవంతు కూడా ఉండడు. అయినప్పటికీ కొండంత ఉన్న ఏనుగును మావటివాడు (ఏనుగుల సంరక్షకుడు) తన దగ్గరుండే అంకుశం (చిన్న కత్తివంటి ఆయుధం) తో లొంగదీసుకుని దాని మీద ఎక్కి కూర్చోగలుగుతున్నాడు. దీనికి కారణం అతనికి ఉన్న తెలివితేటలు. తెలివితేటలకుండే శక్తి గురించి బద్దెన ఈ విధంగా వివరించాడు.

ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా ?
విశ్వదాభి రామ వినురవేమ!

నీతి : మనసు నిర్మలముగా లేకుండా ఆచారములు, పూజ‌లు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థ‌మే. ఏ ప్రయోజనముండదు.

ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచి అతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేగాని మరియంట నేర్చునా !
విశ్వదాభి రామ వినురవేమ!

నీతి : ఇనుము విరిగినచో , ఎర్రగా కాల్చి మ‌ళ్లీ అతికేలా చేయ‌వ‌చ్చు. అదే మనసు విరిగిపోతే తిరిగి క‌ల‌ప‌టం అసాధ్యం. అందుకే ఎవ్వరి మ‌న‌సు నొప్పించకూడదు.

Telugu Neethi Padyalu

ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపే కానీ తెలుపు కాదు
కొయ్యబొమ్మతెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభి రామ వినురవేమ !

నీతి : ఎలుక తోలు తెచ్చి ఎంతకాలము ఉతికిననూ దాని నలుపు పోయి తెలుపు రాదు. అట్లే జీవం లేని చెక్కతో చేసిన బొమ్మను ఎంత కొట్టినా పలుకదు కదా?

చెప్పులోనిరాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమా!

నీతి : చెప్పులోని రాయి, కంటిలోను నలుసు, కాలిలో దిగిన ముల్లు, ఇంటిలోని గొడ‌వ‌ చాలా బాధిస్తాయ‌ని అర్థ‌ము.

ధనము కూడబెట్టి దానంబు చేయక
తానుదినక లెస్స దాచుకొనగ
తేనెటీగగూర్చి తెరువరికియ్యదా
విశ్వదాభి రామ వినురవేమ !

నీతి : ఓ వేమా! ధనమును బాగా సంపాదించి , దానధర్మములు చేయక, తానూ తినక,దాచుకొనుట అన్నది ఎటువంటిదంటే, తేనెటీగ కష్టపడి సంపాదించిన తేనె దారినపోయే బాటసారుల పాల్జేసిన విధముగా నుండును.

ఉప్పులేని కూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పులేనివాడే అధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినురవేమ

నీతి :ఉప్పు లేని కూర రుచికరంగా ఉండదు .పప్పులేని భోజనం వల్ల బలం రాదు . ఈ భూమిలో అప్పు లేనివాడే గొప్ప ధనవంతుడు .

Neethi Padyalu in Telugu

Leave a Comment